బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి(Purandeswari), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasaireddy) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేస్తూ సెటైర్లు విసిరారు. తన ట్వీట్లకు కారంచేడులో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లకు సంబంధించిన లిస్టును X(ట్విట్టర్)లో విజయసాయిరెడ్డి జత చేశాడు.
విజయసాయిరెడ్డి ట్వీట్లో ఏమన్నారంటే.. ‘కారంచేడు 145వ పోలింగ్ బూత్‌లో బీజీపీకి పడిన ఆరు ఓట్లలో అసలు పురంధేశ్వరి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షుడు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై రాష్ట్ర అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు..! అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అలాగే మరో ట్వీట్లో ‘‘చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు? మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బీజేపీ నుంచి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎందుకు పోటీ పెట్టలేదు? రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? అంటూ నిలదీశారు.
మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అంటూ పురంధేశ్వరిని సాయిరెడ్డి నిలదీశారు. కొంపదీసి ‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు. ఇదే కదా మీకు బీజేపీ పట్ల ఉన్న చిత్తశుద్ధి అంటూ విమర్శించారు. వెనకటికి ఒకామె.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ పురందేశ్వరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.