సినీ నటి, బీజేపీ (BJP) నేత విజయ శాంతి (Vijaya Shanthi) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంత కాలంగా ఆమె బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఆమె బీజేపీని వీడారు. తాజాగా ఆమె చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
గతంలో ఆమె కాంగ్రెస్ నుంచి కాషాయ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆ పార్టీలో ఆమె కీలక నేతగా వ్యవహరించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె బీజేపీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. ఇటీవల ప్రధాని మోడీ, ఇతర జాతీయ నేతల సభలకు కూడా ఆమె గైర్హాజరు అవుతూ వచ్చారు.
ఈ క్రమంలో ఆమె పార్టీ మారతారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని గత కొన్ని రోజలుగా చెబుతూ వచ్చారు. ఇటీవల బీజేపీ-జనసేన మధ్య పొత్తులు కుదిరిన నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం కేవలం రెండు రోజుల్లోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవం గమనార్హం.
కేసీఆర్ ను ఢీ కొట్టే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని నమ్మడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు మెదక్ ఎంపీ సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ రావడంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.