మాజీ ఎంపీ, బీజేపీ కీలక మహిళా నాయకురాలు విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర ట్వీట్(Tweet) చేశారు. తన రాజకీయ జీవితంపై ఎమోషనల్గా స్పందించారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ పదవులు ఆశించలేదని, ఇప్పటికీ ఊహించని విధంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని అన్నారు. అప్పుడూ ఇప్పుడూ గొడవలే ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
’25 ఏళ్ల నా రాజకీయ ప్రయాణం అప్పుడూ.. ఇప్పుడు.. ఎందుకో నాకు సంఘర్షణ మాత్రమే ఇస్తూ వచ్చింది. ఇప్పటికీ నేను పదవుల గురించి ఆలోచించడం లేదు. ఏ పదవినీ ఏనాడూ కోరుకోకున్నా.. ఇప్పటికీ అనుకోకున్నా.. ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప.. ఇవాళ్టి బీఆర్ఎస్కు వ్యతిరేకం అవుతాం అని కాదు..’ అంటూ రాసుకొచ్చారు.
అదేవిధంగా ‘నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు.. రాజకీయపరంగా విభేదించినప్పటికీ, అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం మీ రాములమ్మ ఉద్దేశం.. హర హర మహాదేవ్… జై తెలంగాణ..’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు. తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆ తర్వాత కేసీఆర్తో విభేదించి.. బయటకు వచ్చారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ పార్టీపై కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో జరిగిన ప్రధాని పాలమూరు సభకు ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
ఆ తర్వాత తాను బీజేపీలోనే ఉన్నానని, సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో పోటీ చేస్తానని విజయశాంతి ప్రకటించారు. కానీ ఆమెకు బీజేపీ రెండో లిస్టులోనూ చోటివ్వలేదు. రేపు మూడో జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులోనైనా ఆమె పేరు ప్రకటించకపోతే రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.