బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో కార్ రేసింగ్లు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ ఉండడం విశేషం. తాజాగా విజయవాడ(Vijayawada) నగరంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్(Car Racing) ప్రమాదానికి దారితీసింది.
ఈ ఘటన ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఈపీఎల్ ఐనాక్స్(IEPL Inox) ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
వారికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వేంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు ముక్కలుముక్కలుగా అయిపోయాయి. ఫార్చూనర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
ప్రమాదానికి కారకులైన ఫార్చూనర్ కారులోని యువతి, యువకుడు.. మరో కారులో పరారయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఈ గ్రూప్లో ఉన్నారని పోలీసులు విచారణ చేపట్టారు. కొంత కాలంగా బెజవాడలో కార్ల రేసింగ్ తరచుగా జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.