తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ అక్కడక్కడ మాత్రం కొన్ని ఉద్రిక్త ఘటనలు చోట చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సందర్భంగా జోరుగా నగదు పంపిణీ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. పోలింగ్ వేళ వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూర్ ( Tandoor) మండలంలో నగదు పంపిణీ కలకలం రేపింది.
కరన్‌కట్‌లోని కోటవీధి పోలింగ్ కేంద్రం వద్ద నగదు పంపిణీ జరగుతున్న విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల రాకను గమనించిన యువకులు డబ్బులను అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా పట్టుబడిన నగదు రూ.7.45 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఎన్నికల కోడ్ అమలవుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయని పలువురు అంటున్నారు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వారు డబ్బులు పంచడమే కాకుండా బీఆర్ఎస్ (BRS)కు ఓటు వేయాలని చెబుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారమే ధ్యేయంగా నేతలు ఇలా ప్రవర్తించడం పలు విమర్శలకు దారితీస్తుంది.
అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంలో జోరుగా నగదు పంపిణీ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల రూల్స్ కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. అయినా అధికార పార్టీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న తీరుపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి రాష్ట్రంలో మొదలైంది.