ఎన్నికలు (Elections) సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) వేగాన్ని పెంచాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ నియోజక వర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు.
పనిలో పనిగా స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇది ఇలా వుంటే అధికార పార్టీ నేతలకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్లగాన్నే బీఆర్ఎస్ నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా ఆయన నంది పేట మండలం సీహెచ్ కొండూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన్ని గ్రామస్తులు అడుగడుగునా అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావద్దంటూ నిరసనకు దిగారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని జీవన్ రెడ్డిపై గ్రామస్తులు మండిపడ్డారు.
ఇప్పుడు ఓట్ల కోసం తమ గ్రామానికి ఎలా వస్తారని జీవన్ రెడ్డిని (MLA Jeevan Reddy) నిలదీశారు. ఈ క్రమంలో చేసేదేమి లేక జీవన్ రెడ్డి వెనుదిరిగారు. అంతకు ముందు రెండు వారాల క్రితం కుదాన్ పల్లిలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.