కరీంనగర్(Karimnagar)కు బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకురాలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinod Kumar) విమర్శించారు. సిరిసిల్ల(Siricilla)లోని కాలేజీ గ్రౌండ్లో సోమవారం ఆయన మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా కాలేజీ గ్రౌండ్లో వాకర్స్‌ను కలుస్తూ అత్మీయంగా పలకరించారు.
వారికి కరచాలనం చేస్తూ మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఎంపీ వినోద్ కుమార్ దగ్గరకు వచ్చి మళ్లీ బీఆర్ఎస్ పునర్ వైభవం రావాలని కోరాడు. అనంతరం వారితో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. గులాబీ జెండాతోనే తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు.
పార్లమెంటులో తెలంగాణ గొంతు వినబడాల్సిన అవసరం ఉందన్నారు. బండి సంజయ్‌ను మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే అసెంబ్లీ వెళ్లేవారు కదా.. మళ్లీ ఇప్పుడు ఎంపీగా ఎలా పోటీ చేస్తాడని ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమని తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కొండగట్టుకు 300ఎకరాలు సాధించానని తెలిపారు. కుడి చేత్తో పనిచేస్తే ఎడమ చేయికి తెలియనివ్వలేదని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ఏ ప్రభుత్వమున్నా కొట్లాడినట్లు గుర్తు చేశారు. తనకు వేరే ధ్యాసే లేదని, తెలంగాణ అభివృద్ధే లక్ష్యమని తెలిపారు. జాతీయ రహాదారులు సాధించింది తానేనని అన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే ఐదేళ్ల తర్వాత కేరళ మాదిరిగా తయారు చేస్తానన్నారు. తాను గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. అనంతరం కాలేజీ గ్రౌండ్లో క్రికెటర్ల జెర్సీలను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.