మణిపూర్(Manipur) లో మళ్ళీ హింసాత్మక ఘటనలు పేట్రేగాయి. తండ్రీ కొడుకులతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గృహదహనాలు, అల్లరిమూకలకు, పోలీసులకు మధ్య కాల్పులతో బిష్ణుపూర్, చురా చాంద్ పూర్ వంటి జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇంఫాల్ (Imphal) పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో దుండగులు 15కి పైగా ఇళ్లకు నిప్పంటించారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.. బాష్పవాయువు ప్రయోగించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకాన్ లో ఓ వాణిజ్య సముదాయంతో సహా మూడు ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు.
చురాచాంద్ పూర్-బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం రోజంతా మిలిటెంట్లు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగాయి. దుండగులు గ్రెనేడ్ దాడులకు కూడా దిగారు. ఈ ఘటనల్లో 16 మంది గాయపడ్డారు. ఈ సరిహద్దుల్లో ఆర్మీ పెద్దఎత్తున కూంబింగ్ జరిపింది. గత 15 రోజుల్లో ఇంతటి హింసాకాండ జరగడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
బిష్ణుపూర్ జిల్లాలో నిద్రిస్తున్న తండ్రీకొడుకులను దుండగులు కాల్చి చంపారని, ఇటీవలివరకు పునరావాస శిబిరంలో తలదాచుకున్న వీరు ఈ జిల్లాలోని క్వాక్తా గ్రామంలోని తమ ఇంటికి వచ్చినప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని వారు చెప్పారు. మరో ముగ్గురిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేసి చంపారన్నారు. దీంతో వారి ప్రత్యర్థులు ఈ ఏరియాతో బాటు సమీపంలోని మరో రెండు గ్రామాలపై మోర్టార్ దాడులతో విరుచుకపడ్డారని పేర్కొన్నారు.
బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన దాడుల్లో ఒకరు మరణించగా ఓ పోలీసు కమెండోతో బాటు ముగ్గురు బుల్లెట్ గాయాలకు గురయ్యారు. ఇంపాల్ నగరం కూడా నిరసనలతో హోరెత్తుతోంది. అల్లర్లు, ఘర్షణలను అదుపు చేయడంలో కేంద్ర దళాలు విఫలమయ్యాయని సీఎం బీరేన్ సింగ్ (Biren Singh) అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ ఆరోపించారు. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన హింస తనను కదిలించివేసిందన్నారు. భద్రతా దళాలనుంచి దుండగులు ఆయుధాలు లాక్కుని పోతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర బలగాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.