క్రికెట్ చరిత్రలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డులు అన్నీ ఇన్నీ కావు.. మరీ ముఖ్యంగా వన్డేల్లో ఆయన సాధించిన ఘనత నేటి క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలను(Sachin 49 odi centuries) నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యమైనపని అని అప్పట్లో చాలా మంది భావించారు. అలాంటి సమయంలో టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శనతో ఔరా.. అనిపించాడు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).
దాదాపు మూడేళ్లు ఒక్క సెంచరీ చేయకుండా ఉన్న కోహ్లీ ఫామ్ కోల్పోయి విమర్శల పాలయ్యాడు. ఇక విరాట్ కథ ముగిసింది అని అందరూ భావించారు. ఈ క్రమంలో అలాంటి విమర్శలన్నింటినీ పటాపంచలు చేశాడు కోహ్లి. విరాట్ కోహ్లీ వన్డేల్లో ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ చేసిన 49 సెంచరీలకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. విరాట్ సాధించిన ఈ విజయంపైనే ప్రస్తుతం క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇలాంటి సమయంలోనూ కోహ్లీ.. తాను ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం క్రికెట్ ఆడలేదనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా సుదీర్ఘ కాలం తనను జట్టులో కొనసాగించేలా చేసి 78 అంతర్జాతీయ సెంచరీలు 26 వేలకుపైగా పరుగులు సాధించేలా చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ గతేడాది సెప్టెంబర్‌లో సెంచరీ బాదాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విరాట్.. వన్డేల్లో 5, టీ20ల్లో 1, టెస్టుల్లో 2 సెంచరీలతో మొత్తం 8 శతకాలు చేశాడు.
‘సుదీర్ఘ కెరీర్, ప్రదర్శనలతో దేవుడు ఆశీర్వదిస్తాడని.. ఇన్ని సాధిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే నేను ఎదో ఒకటి చేయాలని కలలు కనేవాడిని. కానీ అది ఇలానే చేయాలని ఎప్పుడూ ప్లాన్స్ చేయలేదు. నేనే కాదు ఎవరూ ఇలా చేయలేరు. ఈ 12ఏళ్లలో ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చేస్తానని అనుకోలేదు.. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు సాధించాలని భావించా.. అందుకోసం క్రమ శిక్షణతో పాటు లైఫ్ స్టైల్‌లో అనేక మార్పులు చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు.
కెరీర్ మొదట్లో తాను చాలా ఇబ్బంది పడ్డానని కోహ్లీ బాహాటంగానే ఒప్పుకున్నాడు. దీంతో 2012 తర్వాత విరాట్ తన జీవిన శైలిని పూర్తిగా మార్చుకోడానికి నిర్ణయించుకున్నాడు. డైట్, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించి నిబద్ధతతో కృషి చేశాడు. విరాట్ అప్పుడు తీసుకున్న నిర్ణయమే.. దాదాపు దశాబ్దం కాలం తర్వాత అతడిని ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా నిలిపింది.