విశాఖ(Vishakha) ఫిషింగ్ హార్బర్ (Fishing Harbour)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన ప్రమాద ఘటన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై, పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తూ, వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
బోటులో పార్టీ చేసుకున్న వారు ఎవరు..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీలో ఒక యూట్యూబర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్‌లు దగ్ధమైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్‌లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్‌లు అన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 40బోట్‌లు, కోట్లాది రూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లోకేశ్ కోరారు.