తమిళ హీరో విశాల్ (Vishal) పాలిటిక్స్ (Politics)లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ వార్తలపై విశాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని విశాల్ స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి ఆలోచనలు లేవని పేర్కొన్నారు. ఒక వేళ భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తే ప్రజల తరఫున పోరాడేందుకు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తనకు ఇంత గుర్తింపు ఇచ్చినందుకు ప్రజలందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు.
ప్రజలకు తనకు చేతనైనంతగా సహాయం చేసే ఆలోచనతో దేవీ ఫౌండేషన్ ద్వారా చాలా మందిని ఆందుకున్నానని వివరించారు. చాలా మంది విద్యార్థులను తాను చదివిస్తున్నానని, రైతులకు సహాయం చేస్తున్నానన్నారు. తన ఎప్పుడూ లాభాలను ఆశించి పని చేయలేదని స్పష్టం చేశారు.
తమిళ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. తన పార్టీకి తమిళగ వెట్రి కజగమ్ అని ఆయన వెల్లడించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ కూడా రాజకీయాల్లో వస్తున్నారని వార్తలు ఊపందుకున్నాయి.