ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి(Vivek Venkaya Swami)పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ(BJP)ని వీడిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈడీ(ED) రంగంలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈడీ విచారణలో వందల కోట్ల గురించి తననే అడుగుతున్నారని, ఈటలకూ రూ.27కోట్లు ఇచ్చారు.. మరి అడగరేంటీ? అంటూ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో గురువారం ఉదయం వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ బీజేపీ అధిష్టానంపై మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి తనను అరెస్టు చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈడీ విచారణలో తనను వందల కోట్ల భూమి గురించి అడుగుతున్నారని వివేక్ వెల్లడించారు. అయితే అందులో రూ.27కోట్లు ఈటల రాజేందర్‌కు ఇచ్చారని వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. మరి దానిగురించి ఈటలను పిలిచి అడగాలి కదా? అంటూ ఫైర్ అయ్యారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్‌ను వదిలించుకోవాలి. ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు బాల్క సుమన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.బీజేపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన తనను టార్గెట్ చేశారని వివేక్ అన్నారు.
బీజేపీలో ఉన్నన్నీ రోజులు తనపై ఎలాంటి దాడులు జరగలేదని.. ఓటమి భయంతోనే తనపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చట్టపరంగానే తన కుటుంబ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయని వివేక్ స్పష్టం చేశారు. నన్ను అరెస్టు చేసినా ప్రజలే గెలిపిస్తారని వివేక్ అన్నారు.