అమెరికాలో భారతీయులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆరుగురు వేర్వేరు ఘటనల్లో మృతిచెందారు. తాజాగా మరో ఘటన వాషింగ్టన్(Washington)లో వెలుగుచూసింది. అక్కడ ఓ రెస్టారెంట్ బయట జరిగిన దాడిలో భారత్కు చెందిన 41ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.
ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయ అమెరికన్ వివేక్ తనేజ(Vivek Taneja) అనే వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా బుధవారం (ఫిబ్రవరి 8)న మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సివుంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీపుటేజీ ఆధారంగా అతన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు పోలీసులు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్కు చెందిన సయ్యిద్ మజహిర్ అలీ అనే వ్యక్తిని చికాగోలో అటాక్ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ ఏడాది శ్రేయాస్ రెడ్డి బెనిగెర్(19), వివేక్ సైనీ(25), నీల్ చార్య, అకుల్ ధావన్ అనే విద్యార్థులు వివిధ కారణాలతో మృతిచెందారు.