Telugu News » Vivek : వివేక్.. ఏంటి సంగతి..?

Vivek : వివేక్.. ఏంటి సంగతి..?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌ ‌లో ఉన్న వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి గన్‌‌ మెన్‌ లేకుండానే రేవంత్ వెళ్లారు. దాదాపు గంటన్నరసేపు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.

by admin
Vivek Venkataswamy Likely To Join Congress

– కాంగ్రెస్ లోకి వివేక్ వెంకటస్వామి?
– రేవంత్ తో ప్రత్యేక భేటీ
– బీజేపీకి మరో షాక్ తప్పదా?

నేనెందుకు పార్టీ మారతా.. నాకేం అవసరం.. ఎంపీగా బరిలోకి దిగుతున్నా.. బీజేపీ (BJP) లోనే కొనసాగుతున్నా.. కొద్ది రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswami) మాటలివి. కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మాదిరిగానే ఈయన కూడా బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో వివేక్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా.. కమలనాథుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

Vivek Venkataswamy Likely To Join Congress

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌ ‌లో ఉన్న వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి గన్‌‌ మెన్‌ లేకుండానే రేవంత్ వెళ్లారు. దాదాపు గంటన్నరసేపు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా వివేక్‌ ను రేవంత్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో.. వివేక్ కూడా హస్తం పార్టీకి జైకొడతారనే ప్రచారానికి ఈ సమావేశం బలాన్ని చేకూర్చింది. వివేక్ సోదరుడు వినోద్‌ కు కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అసెంబ్లీ టికెట్‌ ను ఖరారు చేసింది.

హైకమాండ్ పై వివేక్ చాలాకాలంగా అసంతృప్తిలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో పాలమూరు బీజేపీ సభకు ప్రధాని మోడీ హాజరు కాగా.. ఈయన డుమ్మా కొట్టారు. వివేక్‌ తో పాటు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో వీరు పార్టీ మారబోతున్నారనే ప్రచారం అప్పటి నుంచి ఊపందుకుంది. కానీ, రాజగోపాల్ రెడ్డి ఒక్కరే జంప్ అయ్యారు. అయితే.. పార్టీ మార్పు వార్తల్ని ఖండించారు వివేక్. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. బీజేపీలోనే కొనసాగనున్నట్లు చెప్పారు.

ఈసారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్‌ కు పోటీ చేయనున్నట్లు వెల్లడించారు వివేక్. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని వివేక్‌ స్పష్టం చేశారు. దీంతో మార్పు వార్తలకు చెక్ పడింది. కానీ, రేవంత్ తో భేటీతో మళ్లీ సీన్ మారిపోయింది. లోక్‌ సభ టికెట్ హామీతో వివేక్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఒకసారి పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డు ఈయనకు ఉంది.

You may also like

Leave a Comment