ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్యా ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి(Dasthagiri).. వైఎస్ వివేకాను ఏపీ సీఎం జగనే చంపించారని సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ మేరకు జైలులో జరిగిన ఘటనలపై విచారణ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు, సీబీఐకి దస్తగిరి లేఖ రాశానన్నాడు. కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దస్తగిరి మాట్లాడుతూ ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకా హత్య జరిగిందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారాను కాబట్టే జై భీమ్ భారత్ పార్టీ తరఫున పులివెందులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపాడు.
వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని, బాబాయ్‌ను చంపిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉంటుందా అని దస్తగిరి నిలదీశాడు. అప్రూవర్‌గా మారినప్పటికీ తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారడంతో తనను బెదిరిస్తున్నారని ఇటీవల కడప జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
వివేకా హత్య వెనక ఏపీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారని దస్తగిరి ఆరోపించాడు. జైలులో తనను చైతన్యరెడ్డి కలిసినప్పటి సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలని దస్తగిరి డిమాండ్ చేశాడు. తనను బెదిరించి రూ.20కోట్ల ఆఫర్ చేసిన విషయంతోపాటు జైలు అధికారులు హింసించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐని కోరారు. ఓ పత్రికలో అసత్య వార్తలు రాస్తున్నారంటూ తెలిపాడు.
గతేడాది అక్టోబరు 30 నుంచి 31 వరకు ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజులు తనపై ఉన్న అట్రాసిటీ కేసు అడ్డం పెట్టుకుని వివేకా హత్యకు సంబంధించి అవినాష్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు దస్తగిరి లేఖలో పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారడానికి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను కొట్టి ఒప్పించారని కోర్టులో చెప్పాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని చెప్పాడు. దానికి అంగీకరించకపోవడంతో అరెస్టు చేసి జైలుకు పంపారని వివరించాడు.