ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో, విశాఖ (Vizag) రూరల్ ఎమ్మార్వో (MRO) రమణయ్య హత్య ( Ramanaiah Murder) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.. ఈ క్రమంలో ఆయన హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఇదిలా ఉండగా రమణయ్య హత్య ఘటన రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది..
విధి నిర్వహణలో ఉన్న వారిపై దాడి చేయకుండా చట్టాలను కఠిన తరం చేయాలని ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులు (Revenue Employees) డిమాండ్ చేస్తున్నారు. వినతి పత్రాలు అందజేస్తున్నారు.. మరోవైపు నేటి నుంచి పెన్‌డౌన్ (Pen Down)కు పిలుపునిచ్చారు. ఎమ్మార్వో హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఆరోపిస్తూ.. రెవెన్యూ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది..
ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుని రెవెన్యూ ఉద్యోగులకు భరోసా అందించాలని కోరుతున్నారు. మరోవైపు రమణయ్య హత్యపై రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో చర్చించిన ఉద్యోగులు.. ప్రభుత్వం స్పందించే వరకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి పెన్ డౌన్ చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు..
ఎమర్జెన్సీ కేసులు, పాత కేసులు తప్ప కొత్త వాటిని ప్రారంభించ కూడదని ఉద్యోగులు నిర్ణయించారు. ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. రమణయ్య పిల్లలకు చదువు, రమణయ్య భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది..