నిర్లక్ష్యం పలకడానికి చిన్న పదం అయినా దీని విలువ ఓ జీవితం.. ఓ కుటుంబం.. ఓ ప్రాణం.. ఈ మూడు ఎన్ని కోట్లు సంపాదించిన తిరిగి పొందలేమన్న నిజం అందరికీ తెలుసు.. కానీ కొందరు నిర్లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టరు. సమాజంలో అడుగడుగునా పేరుకుపోయిన నిర్లక్ష్యం వల్ల పోతున్న ప్రాణాలు లెక్కపెడితే రోజులు కూడా సరిపోవు. మరోవైపు హాస్పటిల్స్ అంటే నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ దవాఖానాలో అడుగడుగునా నిర్లక్ష్యం నల్ల చీర కట్టుకుని సంచరిస్తుందనే అపవాదు ఉంది. ఈ నిందను నిజం చేస్తూ.. విజయనగరం జిల్లాలో ఓ ఘటన వెలుగు చూసింది..
విజయనగరం (Vizianagaram)జిల్లా దత్తిరాజేరు (Dattirajeru) పీహెచ్సీ (PHC)లో వైద్యుల నిర్లక్ష్యం బిగ్ స్క్రీన్ లో కనిపించింది. ఇక్కడ ఉన్న పీహెచ్సీ సెంటర్లో గడువు ముగిసిన మందులను ప్రజలకు ఇవ్వడం కలకలం సృష్టిస్తుంది. తాజాగా ఇక్కడి వైద్యులు (Doctors) పిల్లలకు గడువు ముగిసిన వ్యాక్సిన్ (Expired vaccine)ను ఇచ్చినట్టు గుర్తించారు. గడువు ముగిసిన మందులపై ఉన్న లేబుల్ మార్చి ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇస్తున్నట్టు కొందరు గమనించారు..
ఈ విషయం ప్రముఖ మీడియా దృష్టికి వెళ్ళగా.. వారు అక్కడికి చేరుకునే సమయానికి పీహెచ్సీ సిబ్బంది వ్యాక్సిన్ పై లేబుల్ ను తారుమారు చేస్తూ కనిపించారని సమాచారం. మరోవైపు మజిల్స్ అండ్ రూబెల్ వ్యాక్సిన్ (Measles and rubella vaccine) గడువు తొమ్మిదో నెలలో ముగిసినప్పటికీ వైద్య సిబ్బంది పిల్లలకు అందించడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అంటున్నారు.. కాగా గడువు ముగిసిన వ్యాక్సిన్ ఉంచడం ఒక నేరం.. లేబుల్ మార్చడం మరో నేరం.. ఇలా నేరాలకి పాల్పడ్డ క్రిందిస్థాయి సిబ్బందిని కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రయాత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..