ఆంధ్రప్రదేశ్ సర్కార్(AP Government) గడప వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా వలంటీర్(Volunteer) వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తరచూ కొన్ని ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వలంటీర్లు యువతులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.
తాజాగా ఏలూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వలంటీర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ యువతిని లోబర్చుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ యువతి గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి రావడం గమనార్హం. వలంటీర్ మండిగ సత్య గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని చెప్పిన గణేష్.. తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తీరా గర్భవతి అయ్యాక.. పెళ్లికి నిరాకరించాడు.
దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలవరం పోలీసులను ఆశ్రయించింది.. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, వలంటీర్ వ్యవస్థపై ఓవైపు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి..