ఓటు (Vote) అనేది ప్రజాస్వామ్యం (Democracy)లో బ్రహ్మాస్త్రం లాంటిదని బృందావనంలోని శ్రీ ఆనంద ధామ్ పీఠానికి చెందిన సద్గురు ఋతేశ్వర జీ మహరాజ్ (sadguru Rutheshwar ji Maharaj) అన్నారు. ఓటు వేస్తే ఏమిటి, వేయకపోతే ఏంటని నిర్ణక్ష్యం వహిస్తే భవిష్యత్తులో దేశం విషయంలోనే కాదు, తమ ఇంట్లోని వారి పరిస్థితులు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సనాతన హిందూ దర్మ పరిరక్షణకు కట్టుబడే వ్యక్తులు, పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని తెలంగాణ ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇటీవల హిందూ సనాతన ధర్మంపై పలు పార్టీలు, నాయకులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని హిందూ ఓటర్లు పట్టించుకోకుండా వదిలేస్తే రేపు ఇంట్లోని ఆడవాళ్లు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లోని సీతారాం బాగ్‌లోని పురాతన రామ మందిరంలో నిర్వహించిన భారత భాగ్య సమృద్ది యజ్ఞాన్ని ఆయన సందర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల భాషను వదలి మాతృభాషలో మాట్లాడడాన్ని చిన్న చూపు చూడవద్దన్నారు. సనాతన ధర్మం, భారతీయతను నాశనం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిపట్ల అప్రమత్తతతో ఉంటూ మన సంస్కృతిని హైందవ సమాజం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం మన జీవన పద్దతి అని అన్నారు. మనమంతా కలసి భారతీయ మూలాలను కాపాడుకోవాలన్నారు.
హిందూ సనాతన ధర్మంపై పలు కోణాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. వాటిని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భాగ్యనగరంలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన భాద్యతను ప్రతి హైందవ బంధువు గుర్తించాలన్నారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించకపోతే రేపు హిందువులు తమ రక్షణను కోల్పోయే అవకాశం ఉందన్నారు.
మెకాలే విద్యా విధానం కారణంగా భారతీయ సమాజంలో కొంత ఆత్మ నూన్యతా భావం నెలకొందన్నారు. ముఖ్యంగా ఇది భారతీయుల్లో బానిసత్వాన్ని పెంపొందించిందన్నారు. భారతీయ సాంస్కృతిక పరంపరను ధ్వంసం చేయడంతో పాటు సనాతన ధర్మంపై విషం కక్కడమే ప్రధాన లక్ష్యంగా మెకాలే విధానాన్ని రూపొందించారన్నారు. దీని సమూలంగా మార్చేందుకు త్వరలో రాబోయే నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు.