తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష(Shiresha) కు సోషల్ మీడియాలో విపరీతమై ఫాలోయింగ్ పెరిగిపోయింది.
30సెకన్ల వీడియోతో ఫేమస్ అయిపోయిన బర్రెలక్క ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష మంగళవారం ఇంటింటి ప్రచారం చేసింది.
అయితే, కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో శిరీష సోదరుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శిరీష ప్రచారానికి లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలేని వారే ఇలా దాడులకు పాల్పడున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా శిరీష, ఆమె సోదరుడిపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. శిరీష కుటుంబంపై దాడిని x(ట్విట్టర్)లో ఖండించారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్, సీఈవో తెలంగాణను ట్యాగ్ చేశారు.
Adequate security be provided to Ms. Sirisha @ barrelakka independent candidate from kollapur constituency, Nagarkurnool district, Telangana & her family members in view of the attack on her brother today. @TelanganaDGP @ECISVEEP @CEO_Telangana
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) November 21, 2023