తెలంగాణ (Telangana)లో హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా అధికార బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను విమర్శిస్తూనే.. చేసిన, చేయబోయే అభివృద్ధి గురించి చెబుతుంది. అయితే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నేతల పై దాడులు జరగడం రాజకీయ వర్గాలలో పలు అనుమానాలకు తావిస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ (Nagar Kurnool)జిల్లా, అచ్చంపేటలో (Acchampet) బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డబ్బు తరలిస్తున్నారనే అనుమానంతో ఓ కారును హస్తం శ్రేణులు అడ్డుకున్నారని, వాహనంపై రాళ్ల దాడి చేశారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ దాడిలో గువ్వల బాలరాజు (Balaraju)కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. మరోవైపు హస్తం పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని.. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలరాజును ప్రాథమికి చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.