ప్రపంచంలో యుద్ధాలు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసిందే.. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా అక్కడ నెలకొన్న దారుణాలు మాటలకు అందనివిగా మారిపోయాయి.. కాగా మరో యుద్ధం ముంచుకొస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) సంచలన కథనాన్ని ప్రచురించింది. వచ్చే 48 గంటల్లో ఏ క్షణమైనా ఇరాన్ (Iran) నేరుగా ఇజ్రాయెల్ (Israel)పై దాడి చేసే అవకాశం ఉందంటూ పేర్కొంది..
ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు తెలిపారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో ప్రస్తావించడం సంచలనంగా మారింది.. అలాగే ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు, రాజకీయపరమైన నష్టాలపై విశ్లేషణలు చేస్తోందని వెల్లడించింది.. అంతేకాకుండా.. ఏ తరహా, ఏయే ప్రాంతాలపై, ఏ సమయంలో దాడి చేయాలనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది..
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎదుట ఈ ప్లానింగ్స్ రెడీగా ఉన్నాయని ఆ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరాన్, ఇజ్రాయెల్‌పై దాడి చేయనుందనే సమాచారంతో అమెరికా (America) అలర్ట్ అయింది. ఆదేశంలో ఉన్న అమెరికన్లకు అడ్వైజరీని జారీ చేసింది. మరోవైపు ఏప్రిల్ 1న సిరియాలోని డమస్కస్‌లో ఉన్న ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే..
ఈ ఘటనలో ఇరాన్ కీలకమైన సైనిక జనరల్, మరో ఆరుగురు సైనిక అధికారులు మరణించారు.. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయంతో కూడిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌లు తలపడటం మొదలుపెడితే.. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారడమే కాదు.. అల్లకల్లోలం మొదలవుతుందనే చర్చలు తెరపైకి వస్తున్నాయి..