ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్ (Nagarjunasagar) ప్రాజెక్టు జల వివాదం (Water dispute) చిలికి చిలికి గాలివానల మారుతుంది. సరిగ్గా పోలింగ్ రోజునే నాగార్జున సాగర్ జల వివాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేయడం సంచలనంగా మారింది. ఒకవైపు తెలంగాణ (Telangana)లో ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు త్వరలో ఏపీ (AP)లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం రాజకీయ ఎత్తుగడగా పలువురు ఆరోపిస్తున్నారు.
ఇక ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తి వేశారు. మరోవైపు తెల్లవారు జామున ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను నాగార్జున సాగర్, మాచర్ల దారిలో పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదం తీవ్ర రూపం దాల్చుతుందని తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేతల దృష్టి అంతా పోలింగ్ పైనే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.