పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీకి చుక్కలు చూపించేందుకు బీఆర్ఎస్, బీజేపీ సింసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది.
ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు నెరవేస్తున్నారని ఓవైపు బీఆర్ఎస్(BRS), మరోవైపు బీజేపీ(BJP) సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం తరఫున ఏ చిన్న తప్పు దొరికిన దానిని అవకాశంగా మలుచుకునేందుకు గులాబీ పార్టీ ఎదురుచూస్తున్నది.
ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయి 3 రోజులు గడిచినా అధికారులు అవే నీటిని ప్రజలకు సప్లయ్ చేసిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీరియస్ అయ్యారు.
నల్లొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో 30-40 కోతుల కళేబరాలు వాటర్ ట్యాంకులో బయట పడగా.. సోషల్ మీడియా ‘ఎక్స్’(X) వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ మున్సిపల్ శాఖ పనితీరు సిగ్గుచేటు. క్రమం తప్పకుండా వాటర్ ట్యాంకులను శుభ్రం చేయకుండా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి పబ్లిక్ హెల్త్ కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే పాలన ఇలా అస్తవ్యస్తంగా ఉంది’ అంటూ ఘాటుగా స్పందించారు.