మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంతో తాము జీవన భృతిని కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల తాము తీవ్రంగా నష్ట పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ (Rally) చేపట్టారు.
పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ….మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు తరుచుగా తమ ఆటోల్లో ఎక్కేవారని తెలిపారు. కానీ మహాలక్ష్మీ పథకం వచ్చాక తమ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారంతా ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని అన్నారు. దీంతో తమ ఆటోల వైపు చూసే వాళ్లే కరువయ్యారని వాపోయారు. ప్రస్తుతం తమకు రోజుకు రూ. 200లు కూడా రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.
కానీ ఈ పథకంలో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అన్నారు. అందువల్ల ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 వేల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు ఉచిత విద్యా విధానం అమల్లోకి తీసుకురావాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇంటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు.