మునుగోడు (Munugodu) కాంగ్రెస్ (Congress) టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇంకా టికెట్ ఖరారు కాకుండా తమదే టికెట్ అంటూ నియోజకవర్గం లో తిరుగుతూ నలుగురు అభ్యర్థులు (Candidates) ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపి అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు ఖరారు అయినట్టుగానే తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ లో మాత్రం టికెట్ కోసం ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో… ఈ టికెట్ ఎవరికీ కేటాయించాలని దానిపై అధిష్టానం అయోమయంలో ఉంది.
ఈ టిక్కెట్ కోసం చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ ముగ్గురు తమకే టికెట్ దక్కుతుందని నియోజకవర్గంలో తిరుగుతూ తమ అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఎవరికి వారు సొంత పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలలో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి కలిసి పనిచేశారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం టికెట్ కోసం ఎదురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు చలమల కృష్ణారెడ్డి అధిష్టానం ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే పాల్వాయి స్రవంతి సహకరించడం లేదని ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పార్టీ అధ్యక్ష పదవులను సైతం చలమల కృష్ణారెడ్డి తన అనుచరులకే కేటాయించుకున్నారంటూ కైలాష్ నేత ఆందోళన కూడా చేశారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా ఈ ముగ్గురు నేతలు కూడా మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అధిష్టానానికి ఈ వ్యవహారం అంతా తలనొప్పిగా మారింది.
చైతన్య యాత్ర పేరుతో చలమల కృష్ణారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో యాత్ర నిర్వహిస్తున్నారు. అలాగే పాల్వాయి స్రవంతి కూడా తనకే సీటు వస్తుందంటూ అనుచరులతో చెప్పుకుంటూ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా బీసీ కోటాలో ఈ సీటు తనకే లభిస్తుందని ఆశిస్తున్న కైలాష్ నేత కూడా ప్రచారం చేసుకుంటున్నారు.
టికెట్ ఆశిస్తున్న ఆశవాహుల్లో మునుగోడు సీటు ఎవరికి కేటాయించిన మిగతా వారు సహకరిస్తారా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీకి అనుమానంగా మారింది. దీంతో టికెట్ ఎవరికి ఇస్తారు? క్యాడర్ ఎటువైపు వెళుతుంది? అనే సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు కాంగ్రెస్ వామపక్షాలతో జతకడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు ఖరారు అయితే పొత్తులో భాగంగా మునుగోడు టికెట్ తమకే ఇవ్వాలని వామపక్ష పార్టీలు ఇప్పటికే అడుగుతున్నట్టు సమాచారం. ఈ తలనొప్పులు భరించలేక అధిష్టానం పొత్తులో భాగంగా సీపీఐ కేటాయిచేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకుల అంచనా.