– ఉమ్మడి రాష్ట్రంలో అలసత్వం
– స్వరాష్ట్రంలోనూ అంతకంటే నిర్లక్ష్యం
– 55 శాతానికి పైగా ఉన్నా..
– వాళ్లంతా ఓట్లు వేసే యంత్రాలేనా?
– ఇన్నేళ్లలో.. ఒక్క బీసీ సీఎం ఎందుకు కాలేదు?
– బీఆర్ఎస్ లో ఛాన్స్ లేదు
– కాంగ్రెస్ లో రెడ్డిల హవా
– దశాబ్దాల కల నెరవేరుస్తామంటున్న బీజేపీ
– బీసీ అంటే.. బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ గ్రౌండేనా?
తెలంగాణ (Telangana) లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల టైమే ఉంది. పార్టీలన్నీ ఓటేయండి మహాప్రభో అంటూ గ్రామాలపై పడ్డాయి. కులాలవారీగా మీటింగులు, చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బీసీ ద్రోహి ఎవరు..? అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వరకు.. పార్టీలు ఎవరెవరికి సీఎం పోస్టులు ఇచ్చాయనే అంశంపై తెగ మాట్లాడుకుంటున్నారు బీసీలు.
రాజకీయంగా అణచివేత!
ఉండడానికి అత్యధిక ఓటు శాతం ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క బీసీ సీఎం కూడా లేరు. అసలు, బీసీలు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయికి రావడం అంటేనే గగనమైపోయిందనే టాక్ ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిల్లోనే చాలామంది రాజకీయ జీవితం ముగుస్తోంది. ఎప్పటినుంచో ఉన్న కొందరు నేతలు మినహా.. కొత్తవారికి ఛాన్స్ రావడం లేదని అంటున్నారు బీసీలు. ఓసారి గతంలోకి వెళ్తే.. బీసీలకు పార్టీలు చేసిన అన్యాయం ఏంటో తెలుస్తుందని వివరిస్తున్నారు.
కాంగ్రెస్ లో రెడ్డిల హవా.. కానీ!
1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ (Congress) నుంచి తొలి ముఖ్యమంత్రి అయ్యారు నీలం సంజీవ రెడ్డి. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. తర్వాత దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా కాంగ్రెస్ నుంచి ఎంతోమంది సీఎంలు అయ్యారు. వీరిలో సంజీవయ్య, పీవీ, వెంగళరావు, రోశయ్యను మినహాయిస్తే.. మిగిలిన వాళ్లందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. మొదట్నుంచి కాంగ్రెస్ లో రెడ్డిల హవా కొనసాగుతోంది. అయితే.. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు హస్తం నేతలు. ఆర్థిక ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నట్టు వివరిస్తున్నారు.
టీడీపీలోనూ అంతే!
1983లో టీడీపీ (TDP) ప్రస్థానం మొదలైంది. ఈ పార్టీ నుంచి మొదట ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఈయనది కమ్మ సామాజిక వర్గం. ఇదే పార్టీ నుంచి రెబల్ సీఎం అయిన నాదెండ్ల భాస్కర్ ది కూడా అదే. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గమే. టీడీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గ నేతలు, కొందరు బీసీ నాయకులు ఎదిగారు. ఈ పార్టీ బలపడడంలో బీసీలదే కీలక పాత్ర. కానీ, ఇంతవరకు ఆ బీసీల్లో ఒక్కరికి కూడా సీఎం ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఏపీలో చంద్రబాబు, తర్వాత ఆయన తనయుడు లోకేష్ కి, లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉంటుంది.
బీఆర్ఎస్ లో నో ఛాన్స్
తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేసీఆర్ (KCR) సీఎం అయ్యారు. రెండు పర్యాయాల నుంచి ఆయనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఆయన కుటుంబానికి చెందినవాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అంటే బీసీలకు ఇప్పుడప్పుడే ఆ పదవి ఇచ్చే అవకాశం లేనట్టే. ఆఖరికి ఎమ్మెల్యే సీట్లలోనూ వివక్ష చూపిందనే విమర్శలను మూటగట్టుకుంది ఈ పార్టీ. సీఎం పదవి కల్వకుంట్ల కుటుంబాన్ని దాటి బయటివారికి, అదికూడా బీసీ నేతకు అందడం అంటే అయ్యే పని కాదని అనుకుంటున్నాయి రాష్ట్రంలోని బీసీ వర్గాలు. అసలు, బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని ప్రతీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే బ్యాక్ గ్రౌండ్ తామేనని చెబుతున్నాయి.
బీజేపీ బీసీ సీఎం మంత్రం
బీఆర్ఎస్ (BRS) లో అవకాశం లేదు.. కాంగ్రెస్ లో రెడ్డిల హవా ఉండడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా తోడవడంతో ఆపార్టీలోనూ బీసీ సీఎం ఇప్పుడప్పుడే కష్టమని అనుకుంటున్నారు బీసీలు. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) బీసీ సీఎం నినాదం అందుకోవడం కొత్త చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ లో బీసీ సీఎం కల కష్టం.. కాంగ్రెస్ లో రెడ్డి నేతల లిస్టు చాలానే ఉంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి లేని లోటును బీజేపీ పూడ్చుతుందని కమలనాథులు చెబుతున్నారు. ఈ హామీ మరే పార్టీ ఇవ్వదని.. అది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని అనేక అంశాలను వివరిస్తున్నారు. మోడీ ప్రధాని కావడం, దళిత మహిళ ముర్ము ను రాష్ట్రపతిని చేయడం వంటివి బీజేపీతోనే సాధ్యమయ్యాయని అలాగే, బీసీ సీఎం కల కూడా తమతోనే నెరవేరుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీలంతా ఎటువైపు మొగ్గు చూపుతారా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.