– చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్న నేతలు
– పార్టీలకతీతంగా ఖండన
– ఒకరిపై ఒకరు ఆరోపణలు
– వైసీపీ కుట్ర అంటున్న టీడీపీ
– బీజేపీ డైరెక్షన్ లోనే జరిగిందంటున్న బీఆర్ఎస్
– కాదు, కేసీఆర్ ఉండొచ్చని కాంగ్రెస్ అనుమానం
స్కిల్ డవలప్ మెంట్ స్కాం జరిగిందని.. దీని వెనుక పాత్రధారి, సూత్రధారి మాజీ సీఎం చంద్రబాబే (Chandrababu) అని జైలు దారి చూపించింది ఏపీ సీఐడీ (AP CID). హైడ్రామా నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే.. ఈ అరెస్ట్ (Arrest) పై తెలుగు రాష్ట్రాల్లో నేతలు పార్టీలకతీతంగా ఖండిస్తున్నారు. కానీ, ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
చంద్రబాబుపై ఉన్న కక్షతో జగనే (Jagan) కావాలని తప్పుడు కేసు పెట్టించారనేది టీడీపీ (TDP) వాదన. జనసేన (Janasena) కూడా ఇదే రాగం అందుకుంది. కానీ.. కొందరు టీడీపీ నేతలు దీని వెనుక బీజేపీ (BJP) హస్తం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంతో జగన్ లాలూచీ పడి చంద్రబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. ఈ కామెంట్స్ పై ఏపీ బీజేపీ (AP BJP) నేతలు స్పందించారు. రాష్ట్ర సీఐడీ అరెస్ట్ చేస్తే కేంద్రానికి ఏం సంబంధమని ధీటుగా బదులిచ్చారు. అయినా కూడా ఇతర పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్న బీఆర్ఎస్ (BRS) నేతలు ఓవైపు దీన్ని ఖండిస్తూనే.. ఇంకోవైపు బీజేపీ అండదండ లేకుండా జగన్ ఇంత ధైర్యం చేయలేరని అంటున్నారు. కచ్చితంగా బాబు అరెస్ట్ వెనుక కమలం పార్టీ హస్తం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా అంటున్నాయి. ముమ్మాటికీ బీజేపీ కుట్ర ఉందని గట్టిగా వాదిస్తున్నాయి. అమిత్ షా (Amit Shah) ఆదేశాలు లేకుండానే ఇది జరిగిందా? అని ప్రశ్నిస్తున్నాయి.
ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ కూడా స్పందించింది. ఆపార్టీ తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ (Madhu Yashki) మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని అభిప్రాయపడ్డారు. దీని వెనుక కేసీఆర్ (KCR), జగన్ ఉన్నారని అన్నారు. ఇద్దరూ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్ కు తెలియకుండా జగన్ ఏమీ చేయలేరని అన్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కేసీఆర్ సూట్ కేసులను పంపించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ (YCP) మూడూ ఒక్కటేనన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ చుట్టూ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. దీని వెనుక మీరున్నారంటే మీరున్నారని ఆరోపణలు చేసుకుంటున్నాయి.