– ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలి
– బీజేపీ చర్యలపై ఫోకస్ పెంచాలి
– మసీదుల్లో యువత ఎక్కువగా ఉండేలా చూడాలి
– ఎన్నో ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం కోల్పోయాం
– మీ గుండెల్లో బాధ లేదా..?
– మరిన్ని మసీదులపై కుట్రలు జరుగుతున్నాయి
– అందరం చనిపోతాం..
– కానీ, అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారు
– అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
– హిందూ సంఘాలు, బీజేపీ వర్గాల ఆగ్రహం
అయోధ్య (Ayodhya) స్థలం రామ మందిరానిదేనని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనమే తేల్చి చెప్పింది. కొద్ది రోజుల్లో అక్కడ దివ్య భవ్య రామాలయం ప్రారంభం కానుంది. దేశంలోని హిందూవులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కావాలనే బాబ్రీ మసీదు కూల్చివేత ప్రస్తావన తీసుకొచ్చి.. దేశంలోని ఇతర మసీదులను కూడా కూల్చేస్తారని ముస్లిం యువతను రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనిపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసద్.. ఎన్నో ఏళ్లుగా ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం తమది కాకుండా పోయిందని.. రామ మందిర స్థలం గురించి మాట్లాడారు. దేశంలో మరిన్ని మసీదుల విషయంలో జరుగుతున్న కుట్రను గమనించాలని.. ఢిల్లీలోని సునెహ్రీ మసీదు కూడా ఈ జాబితాలో ఉందని ఆరోపించారు. చాలా ఏళ్ల పాటు కష్టపడి మనం ఈ స్థాయికి చేరుకున్నామని.. ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలని ముస్లిం యువతకు సూచించారు. ముస్లింలు అందరూ ఐకమత్యంతో ఉండాలని అన్నారు.
మసీదుల్లో ముస్లిం యువత ఎక్కువగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు అసదుద్దీన్. కేంద్ర ప్రభుత్వ చర్యలపై అలర్ట్ గా ఉండాలని సూచించారు. మసీదులను మన నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని తెలిపారు. వాటిని ఎలా కాపాడాలో నేటి యువత జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మదర్సాలను కాపాడాలని కూడా ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. అందరూ చనిపోతారు కానీ మరణానంతరం ఏం సమాధానం చెబుతారు? అంటూ ముస్లిం యువతను ఉసిగొల్పుతూ.. మరణానంతరం అల్లాకు ఏ ముఖం చూపిస్తారో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్.. ముస్లిం యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అంటున్నాయి. అసద్ కావాలనే వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ దురాక్రమణలో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయ్యాయని.. వందల ఏళ్లకే ఇంతలా బాధపడుతున్న ఆయన.. వేల ఏళ్ల నాటి హిందూ ఆలయాలను కూల్చి కట్టడాలు నిర్మిస్తే తమకు ఎలా ఉంటుందో ఆలోచించాలని నిలదీస్తున్నాయి.