– బీజేపీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ప్రచారం
– మేనిఫెస్టో ఆలస్యంతో అయోమయం
– హామీలపై క్లారిటీ లేకపోవడంతో నిలదీస్తున్న ప్రజలు
– ఎట్టకేలకు స్పందించిన హైకమాండ్
– 12 లేదా 13న మేనిఫెస్టో ప్రకటన
– అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా హామీలకు ప్లాన్
తెలంగాణ (Telangana) లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని చూస్తోంది. ఓవైపు జాతీయ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వస్తున్నారు. మంగళవారం ప్రధాని మోడీ (PM Modi) కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. జనసేన (Janasena) తో పొత్తు కన్ఫామ్ అయింది. దీంతో మరింత ఉత్సాహంగా జనంలోకి వెళ్లాలని చూస్తోంది బీజేపీ. అయితే.. అభ్యర్థులకు అడుగడుగునా చుక్కలు కనబడుతున్నాయి.
ఓటర్లను ఆకర్షించడంలో మేనిఫెస్టోది కీలక పాత్ర. ఇప్పటిదాకా ఏం చేశాం.. ఇకపై ఏం చేస్తామని అందులో పొందుపర్చి ఓటర్లకు గాలం వేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, బీజేపీ మాత్రం ఈ అంశంపై దృష్టి పెట్టినా ప్రకటన ఆలస్యమైంది. దానివల్ల ప్రజల ముందుకు వెళ్తున్న బీజేపీ నేతలకు ఏం హామీ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులనే వివరిస్తూ ప్రచారాన్ని ముగిస్తున్నారు.
కొందరు నేతలైతే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ వచ్చిందని సంబరపడాలో… మేనిఫెస్టో రాక, జనానికి ఏం చెప్పాలో తెలియక బాధపడుతున్న పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రచారానికి వెళ్తున్న కొందరు నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఎన్నికల ప్రచారాన్ని త్వరగా ముగిస్తున్నట్టు సమాచారం. ఓటర్లను ఏం చెప్పి తమ వైపునకు తిప్పుకోవాలో తెలియని సందిగ్ధంలో కమలనాథులు పడినట్టు మాట్లాడుకుంటున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు ఎదురవుతున్న పరిస్థితులు చివరకు హైకమాండ్ వరకు చేరినట్టు తెలుస్తోంది. తాజాగా మేనిఫెస్టోపై కీలక ప్రకటన చేశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల 12 లేదా 13న మేనిఫెస్టో రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని.. కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని.. ప్రజా సంక్షేమానికి తగ్గట్టుగా తమ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. దీంతో బీజేపీ అభ్యర్థులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని.. మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఇచ్చే హామీలను వివరించి ఓట్లు అడుగుతామని చెబుతున్నారు.