– వివాదాస్పదంగా తబ్లిఘీ జమాత్ సమ్మేళనం
– ముస్లింల మత కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు
– ఆర్థిక కష్టాలు అని చెప్పుకుంటూ డబ్బులెలా ఇస్తారు?
– ఉగ్రవాదులతో సంబంధాలున్న సంస్థను ప్రోత్సహిస్తారా?
– హస్తాన్ని ప్రశ్నిస్తున్న కాషాయ నేతలు
– వచ్చే నెల 6న పరిగిలో తబ్లిఘీ జమాత్ సమావేశం
– లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల కేసమే ఈ ప్లాన్ వేశారా?
దుబారా ఖర్చులుండవు.. క్యాంప్ ఆఫీస్ చిన్న షెడ్డు చాలు.. కేసీఆర్ (KCR) చేసిన తప్పుల్ని చేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారం చేపట్టినప్పటి నుంచి తెగ గప్పాలు కొడుతున్నారు. కానీ, చేతల్లో మాత్రం తప్పటడుగులు వేస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. అభివృద్ధే తమ లక్ష్యం అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. ముస్లింలకు సంబంధించిన సొంత సమావేశానికి నిధులు కేటాయించడం వివాదాస్పదమైంది. పైగా, ఆ సంస్థకు ఉగ్రవాదులతో లింకులున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
6న తబ్లిఘీ జమాత్ సమ్మేళనం
వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని పరిగి మండలం న్యామత్ నగర్ గ్రామంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు తబ్లిఘీ జమాత్ (Tablighi Jamaat) సమ్మేళనం జరగనుంది. ఇది ముస్లింలకు సంబంధించిన ప్రచార కార్యక్రమం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏషియా దేశాలకు చెందిన వారు, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మేళనానికి భారీ ఎత్తున ముస్లిం మత పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాల్లో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిధుల విడుదల
తబ్లిఘీ జమాత్ సమ్మేళనం కార్యక్రమానికి తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అక్షరాలా 2 కోట్ల 45 లక్షల 93 వేల 847 రూపాయలు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి నిర్వాహకులు సైతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిధులతో భారీ స్థాయిలో ఈ సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాషాయ నేతల అభ్యంతరం
ముస్లింల సమ్మేళనానికి నిధులు కేటాయించడంపై బీజేపీ మండిపడుతోంది. మతపరమైన కార్యక్రమానికి నిధులు ఎలా కేటాయిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. ఇలాంటి సమ్మేళనాలను ఇస్లాం మత బోధనల కోసమే నిర్వహిస్తూ ఉంటారని.. ముస్లిం మతానికి చెందినవారు మాత్రమే వ్యక్తిగతంగా ఖర్చు పెడుతుంటారని చెబుతున్నారు. అలాంటి కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం సరికాదంటూ మండిపడుతున్నారు. రాష్ట్రం దివాళా తీసిందని.. వడ్డీలు కట్టడానికే ఖజానా సరిపోవడం లేదని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి నిధులివ్వడమేంటని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. తుక్టే గ్యాంగ్ తో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇరాన్, ఉబ్జెకిస్తాన్, తజికిస్తాన్, కజికిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా సహా అనేక దేశాలలో ఈ సంస్థపై నిషేధం కొనసాగుతోందని అటువంటి తబ్లిఘీ జమాత్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నించారు. తీవ్రవాద సిద్ధాంతం కలిగిన సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతోందని మండిపడ్డారు. ఈ సంస్థను ప్రోత్సహిస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్లానేనా..?
త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. పదేళ్ల బీజేపీ సర్కార్ ను కూల్చేందుకు విపక్ష నేతలు కూటమిగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి నిధులు కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తబ్లిఘీ జమాత్ మత పెద్దలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మానాలు కూడా చేశారు. దానికి ప్రతిఫలంగా ఈ సమ్మేళనానికి నిధులు కేటాయించినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించినా పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.
అసలేంటీ తబ్లిఘీ జమాత్..?
1927లో హర్యానాలోని మేవాట్ లో ప్రారంభమైంది ఈ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మత బోధనలు, ప్రచారం చేయటమే దీని లక్ష్యం. మైలానా ఇలియాస్ కాంద్లావి దీని వ్యవస్థాపకుడిగా చెబుతుంటారు. 213 దేశాల్లో ఈ సంస్థ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది దీన్ని ఫాలో అవుతారు. అయితే.. ఈ సంస్థ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. 2011లో వికిలీక్స్ తబ్లిఘీ జమాత్ మీద సంచలన ఆరోపణలు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో దీనికి సంబంధం ఉందని పేర్కొంది. కానీ, ఆ సంస్థ మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తోంది. అలాగే, 2020లో కరోనా వ్యాప్తి సమయంలో ఈ సంస్థ పేరు మార్మోగింది. ఆ ఏడాది మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిఘీ జమాత్ సమావేశం వల్ల చాలా మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని కేంద్ర హోంశాఖే ప్రకటన చేసింది. ఢిల్లీ పోలీసులు 233 మంది తబ్లిఘీ జమాత్ సభ్యులను అరెస్టు కూడా చేశారు.