అయోధ్య (Ayodhya) ‘రామ్ లల్లా’ (Ram Lalla)విగ్రహ ప్రాణ ప్రతిష్టను జనవరి 22న నిర్వహించనున్నారు. ఆ రోజు కోసం భక్తులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నీలి మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కన్నులారా చూసి ధన్యులం కావాలని భక్తులంతా కోరుకుంటున్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు నిర్ణయించిన ముహూర్తం వెనుక బలైమన కారణం ఉందని వేద పండితులు చెబుతున్నారు.
లోకాభిరాముడైన శ్రీ రామ చంద్ర మూర్తి అభిజిత్ ముహూర్తంలో జన్మించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆ ముహూర్తం అయితే బాగుంటుందని వేద పండితులు భావించారు. అభిజిత్ ముహూర్తం అనేది అత్యంత పవర్ ఫుల్ ముహూర్తం అని వేద పండితులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే జనవరి 22న అభిజిత్ ముహూర్తం ఉంది. ఆ రోజు ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. దీంతో ఆ రోజునే ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు.
ఇక అభిజిత్ ముహూర్తానికి మరో విశిష్టత ఉంది. త్రిపురా సురుడు అనే రాక్షసున్ని ఆ పరమ శివుడు అభిజిత్ ముహూర్తంలోనే వధించారని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. శత్రునాశనానికి ఇది అత్యంత శుభప్రదమైన ముహూర్తమని వేద పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తం నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుందని, ఎల్లప్పుడు విజయాన్ని ప్రసాదిస్తుందని అంటున్నారు. అందుకే అన్ని రకాల శుభకార్యాలకు ఈ ముహూర్తం మంచిదని విశ్వసిస్తారు.
ఇక హిందూ పంచాంగం ప్రకారం… మృగశిర నక్షత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నక్షత్రానికి సోమదేవతతో సంబంధం ఉంటుంది. ఈ నక్షత్రం జ్ఞానం, అనుభవం సాధనను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం జనవరి 22న సోమవారం రోజు తెల్లవారు జామున 3.52 గంటలకు మృగశిర నక్షత్రం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయం 4:58 వరకు ఈ నక్షత్రం ఉంటుంది. అందుకే జనవరి 22న ముహూర్తం నిర్ణయించారు.
ఈ మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధి యోగం, సవర్త సిద్ధి యోగం ఒకే రోజున వస్తుండటం విశేషం. అందువల్ల ఈ ముహూర్తం అత్యంత శ్రేష్టమైనదని చెబుతున్నారు. ఇక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టను 84 సెకన్లలో పూర్తి చేయనున్నారు. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య ప్రాణప్రతిష్ఠను నిర్వహించనున్నారు. ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా భారత్ పేరు మారుమోగుతుందని చెబుతున్నారు.