Telugu News » Telangana : వాటర్ వార్.. కేసీఆర్, జగన్ కుట్ర చేశారా..?

Telangana : వాటర్ వార్.. కేసీఆర్, జగన్ కుట్ర చేశారా..?

ఎన్నికల అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి, ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలపై ఆయన రియాక్ట్ అవుతారా? లేదా? అనేది చూడాలి.

by admin
ap cm jagan to meet ts former cm kcr on jan 4

– తెలంగాణలో ముదురుతున్న జల జగడం
– కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
– ప్రాజెక్టుల అప్పగింత సందర్భంగా కొత్త ప్రశ్నలు లేవనెత్తిన హస్తం
– జగన్, కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా?
– 8 టీఎంసీలు తరలిస్తుంటే.. కేసీఆర్ ఏం చేశారు?
– కుట్ర మేరకు సైలెంట్ గా ఉండిపోయారా?
– కేఆర్ఎంబీ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదు?
– రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ కు అనుమతిచ్చింది నిజం కాదా?
– తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ
– త్వరలో జనం ముందుకు కేసీఆర్.. ఈ ప్రశ్నలకు సమాధానాలుంటాయా?

తెలంగాణ (Telangana) లో ప్రస్తుతం జల జగడం ఓ రేంజ్ లో జరుగుతోంది. తప్పు మీదంటే మీదని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ హయాంలో చేసినవి, రాష్ట్ర విభజన సమయంలో జరిగినవి అన్నీ పూస గుచ్చినట్టు వివరించారు. దీనికి బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. అయితే.. కేసీఆర్ (KCR), జగన్ (Jagan) మధ్య జరిగిన చర్చలు, ఒప్పందాలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు జనంలో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా ప్రగతి భవన్ (Pragathi Bhavan) వేదికగా చీకటి ఒప్పందాలు జరిగాయా? నీళ్ల వాటాలపై చర్చల సమయంలో ఏం జరిగింది..? కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానాలున్నాయా? త్వరలో జనంలోకి రానున్న కేసీఆర్ దీనిపై స్పందిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

ap cm jagan to meet ts former cm kcr on jan 4

జగన్ గెలుపు కోసం కేసీఆర్ ఫండింగ్..!

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రాకు చంద్రబాబు ముఖ్యమంత్రులయ్యారు. అయితే.. 811 టీఎంసీల నీళ్ల పంపకాలకు సంబంధించి 2015లో కేఆర్ఎంబీ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని ఒప్పందం జరిగింది. దీనికి కేసీఆర్, హరీష్ అంగీకరించి సంతకాలు చేశారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ఓటమికి ప్రయత్నించారు. దీంతో బాగా హర్టయిన కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి.. జగన్ గెలుపు కోసం ఫండింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రగతి భవన్ వేదికగా ఒప్పందాలు జరిగాయా?

2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక.. కేసీఆర్ తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు ఉండవని.. సఖ్యతగా ముందుకెళ్తామని ఇద్దరు నేతలు మీడియాకు లీకులిచ్చారు. అయితే.. కేసీఆర్, జగన్‌ సమావేశం తర్వాత సంగమేశ్వరం ప్రాజెక్ట్ జీవీ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి నీళ్లు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక్కడే కేసీఆర్, జగన్ చీకటి ఒప్పందం బయటపడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. ప్రగతి భవన్ లో జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని.. ఆ చీకటి ఒప్పందం మేరకే ఆ తర్వాత జరిగిన కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వ్యతిరేకించలేదని ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని అంటున్నారు. కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని.. ఆయన పదవులు, కమీషన్లకు లొంగి జల దోపిడీకి సహకరించారని మండిపడుతున్నారు.

సవాల్ కు సై అంటున్న హరీష్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉంటుందా..?

జ‌గ‌న్‌, కేసీఆర్ ఏకాంత చ‌ర్చ‌ల్లో ఏం కుట్ర చేశారు? ఎత్తిపోత‌ల ద్వారా జ‌గ‌న్ రోజుకు 8 టీంఎసీల నీటిని తీసుకెళ్తుంటే ఇన్నాళ్లు ఏం చేశారు? పైగా, కేవలం 2 టీఎంసీల కోసం రూ.ల‌క్ష‌ కోట్లు ఖ‌ర్చు పెట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారు? ఆనాడు చంద్రబాబుతో చర్చల సమయంలో సమాన నీటి వాటాపై ఎందుకు నోరు మెదపలేదు? తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు ఎందుకు చేశారు? రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ కు కేసీఆర్ అనుమతిచ్చింది నిజం కాదా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సీఎం సవాల్ కు సై అన్న హరీష్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

త్వరలో జనంలోకి కేసీఆర్.. కాంగ్రెస్ ప్రశ్నలపై స్పందిస్తారా?

సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌ కు రావడానికి సిద్ధమయ్యారు. మంగళవారం బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌ వేదికగా సమావేశం కానున్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత ఆయన తెలంగాణ భవన్‌ కు రానుండటం ఇదే తొలిసారి. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఎన్నికల్లో తీసుకోబోయే వ్యూహాలు, ప్రజాక్షేత్రంలో తప్పక చెప్పాల్సిన విషయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరి, ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలపై ఆయన రియాక్ట్ అవుతారా? లేదా? అనేది చూడాలి.

You may also like

Leave a Comment