తన కుమారుడికి టికెట్ నిరాకరించడంతో అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantarao). ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Dk Shivakumar) ను కూడా కలవబోతున్నారని.. ఆయన ద్వారా హస్తం గూటికి చేరుతున్నారని రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున తన కుమారుడు రోహిత్ (Rohith) ను బరిలోకి దింపాలని అనుకున్నారు హన్మంతరావు. కానీ, కేసీఆర్ (KCR) ఆయనకు షాకిచ్చారు. తనకు మాత్రమే టికెట్ కేటాయించారు. మెదక్ (Medak) స్థానాన్ని పద్మా దేవేందర్ (Padma Devender) కి అప్పగించారు. దీని వెనుక మంత్రి హరీష్ రావు (Harish Rao) ఉన్నారని సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి. తనతోపాటు కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే కచ్చితంగా పోటీ చేస్తామని అన్నారు. మంగళవారం కూడా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
మెదక్ లో రోహిత్ పోటీ చేయడం ఖాయమని తెలిపారు మైనంపల్లి. ఈ విషయంలో మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మల్కాజిగిరిలో తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ తనకు టికెట్ ఇచ్చి, తన కుమారుడికి ఇవ్వకపోవడంపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నియోజకవర్గాల ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. మైనంపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారడం ఖాయమని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే బీఆర్ఎస్ లోని రోహిత్ వర్గం.. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించింది. దీంతో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో మైనంపల్లికి మంచి రిలేషనే ఉంది. గతంలో వీళ్లిద్దరూ టీడీపీలో కలిసి పని చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు మైనంపల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ ను కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని.. రాహుల్ గాంధీని కూడా కలుస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈమధ్య కాలంలో కాంగ్రెస్ లో చేరాలనుకునే కీలక నేతలందరూ డీకేనే కలుస్తున్నారు. మొన్నామధ్య మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా బెంగళూరు వెళ్లి డీకేను కలిసొచ్చారు. తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మైనంపల్లి కూడా ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం.