లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తీవ్రమైన పోరు తప్పదని అంటున్నారు విశ్లేషకులు.. ప్రధానంగా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న బీజేపీ (BJP)ని కట్టడి చేయడానికి ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి ధీటుగా, బీజేపీ నేతలు సైతం సరికొత్త అస్త్రాలకు పదునుపెడుతున్నట్టు తెలుస్తోంది. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటుబ్యాంకు సాధించడమే లక్ష్యంగా కమలనాధులు పావులు కదుపుతోన్నట్టు సమాచారం..
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం అంటారు. 100 మందిలో కనీసం 51 మంది ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు వారిది మెజారిటీ అభిప్రాయంగా పరిగణిస్తాం. కానీ ఎన్నికల్లో గెలుపొందాలంటే అభ్యర్థి మిగతా అందరి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే చాలని తెలుస్తోంది. అదే ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు 40 శాతం కంటే తక్కువ ఓట్లతో కూడా సునాయాసంగా గెలుపొందవచ్చని.. మిగతా 60 శాతాన్ని మించిన ఓటర్లు ఆ అభ్యర్థిని కోరుకోకపోయినా సరే.. ఆ అభ్యర్థి గెలుపొందవచ్చని అంటున్నారు. సరిగ్గా ఇదే పాయింట్‌ను అస్త్రంగా మలచుకోవాలని విపక్ష కూటమి (I.N.D.I.A) భావిస్తోందని టాక్ వినిపిస్తోంది.
అందులో భాగంగానే విపక్షాలన్నీ కలసికట్టుగా 400కు పైగా స్థానాల్లో బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.. సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిని కల్పించగలిగితే చాలు విజయం సాధించినట్టే అని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 2019 తరహాలో 50 శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందిన సీట్లను ఈసారి మరింత పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ క్రమంలోనే “మిషన్ 400 ప్లస్ – టార్గెట్ 50%” వంటి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని అనుకొంటున్నారు. .
ఇప్పటి వరకు బీజేపీ ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా మార్చుకుని గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది. వారి గెలుపును ప్రభావితం చేసే భావోద్వేగపరమైన అంశాలు ఎలాగూ వారికి అస్త్రాలుగా మారతాయి. గత ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత జరిపిన సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ వంటి దేశభక్తి భావోద్వేగం ఉపయోగపడగా.. ఈసారి అయోధ్య రామమందిర నిర్మాణం, కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిస్థాయిలో అంతర్భాగంగా చేస్తూ ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేయడం వంటి భావోద్వేగాంశాలు బీజేపీ విజయానికి దోహదపడతాయని కాషాయం నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక దేశాభివృద్ధి, సంక్షేమం ఓటర్లను ఎంతమేర కట్టిపడేస్తుందన్న విషయం ఊహకు అందకున్నా.. భావోద్వేగాలతో ముడిపడ్డ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ఒకవైపు పోలరైజ్ చేయగల్గుతాయని కమలం నేతలు భావిస్తున్నారు.. ఇవన్నీ పక్కనపెడితే.. ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి విషయంలోనే అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్నాయనే టాక్ ఉంది.
అదీగాక ప్రతిపక్ష పార్టీల నేతలు చేతులు కలిపినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేతులు కలిపే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో లేవనే ప్రచారం ఉంది. ఇక ఇవన్ని దాటుకొని 2019లో 224 స్థానాల్లో 50 శాతం మించి ఓట్లు సాధించిన బీజేపీని నిలువరించడం విపక్షాలకు అంత సులభం కాదన్న ప్రశ్న సైతం ముందు ఉంది.. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మ్యాజిక్ జరిగితే గాని బీజేపీ విజయానికి బ్రేకులు పడవని అంటున్నారు..