తెలంగాణ(Telangana)లోని చాలాచోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకు పగలు, రాత్రి ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు చలితో గజగజ వణుకుతున్నారు. నైరుతి రుతుపవనాలు(Monsoon) తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు శీతల గాలులు మొదలవుతాయి.
రాష్ట్రంలో అత్యల్పంగా హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండతో పాటు మెదక్, రామగుండంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్, భద్రాచలంలో అక్టోబర్ నెలలో కూడా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది.
చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నవంబర్ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే హైదరాబాద్‌లో మాత్రం భిన్నపరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రమంతా శీతాకాలం అనుభవిస్తుంటే.. రాజధాని మాత్రం ఇంకా ఉక్కపోతతో ఇబ్బంది పడుతోంది. భద్రాచలం, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి.