వాగు దాటుతూ ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు మహిళలు ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. దాదాపు 6 గంటల పాటు పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా(Mahbubnagar District)లో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం(Middle mandal) చిలివేరు(Chiliveru) గ్రామానికి చెందిన నీలమ్మ (55), సుగుణమ్మ (35) నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆవంచ గ్రామానికి వెళ్లారు.
ఆ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో తిరిగి గ్రామానికి వస్తూ మార్గమధ్యలో ఉన్న దుందుభి వాగు దాటుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో కొట్టుకుపోయారు.
వాగు మధ్యలోని చెట్ల కొమ్మలను పట్టుకుని కేకలు వేశారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. గ్రామస్థులు, అధికారులకు సమాచారం అందించారు. ఎమ్మార్వో రాజునాయక్(Raju Naik), ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వరద ఉధ ఎక్కువగా ఉండటంతో జిల్లా పాలనాధికారికి సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ రెస్క్యూ సిబ్బంది మరబోటు సహాయంతో మహిళలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 6 గంటల పాటు నీటిలో ఉండటంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.