రాజేంద్ర నగర్ వర్శిటీలో ఏబీవీపీ (ABVP)మహిళా నాయకురాలి పట్ల మహిళా పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ (women’s commission) సీరియస్ అయింది. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇది అమానుష ఘటన అంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్యార్థిని అలా రోడ్డుపై ఈడ్చుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఘటనపై తమకు నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఘటనకు కారణమైన పోలీసులు వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది.
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్శిటీ భూమిని హైకోర్టు నూతన భనవానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్శిటీని ముట్టడించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. వర్శిటీలో హైకోర్టుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పోలీసులను తప్పించుకుని పరుగెత్తారు. దీంతో ఆమెను మహిళా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో ఝాన్సీని కింద పడిపోగా మహిళా పోలీసులు ఝాన్సీ జుట్టు పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.