Telugu News » Tamilisai: నియంతృత్వ పాలనకు చరమగీతం.. రాజ్యాంగం వల్లే సాధ్యమైంది: తమిళిసై

Tamilisai: నియంతృత్వ పాలనకు చరమగీతం.. రాజ్యాంగం వల్లే సాధ్యమైంది: తమిళిసై

రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో వ్యవహరించడం వల్లే అన్ని వర్గాలకు న్యాయం చేకూరే అవకాశం దక్కిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్యాంగం వల్లే తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగామని చెప్పారు.

by Mano
Tamilisai: An ode to dictatorship.. Made possible by the Constitution: Tamilisai

తెలంగాణ(Telangana) ప్రజలు నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్(Nampally Public Gardens)లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.

Tamilisai: An ode to dictatorship.. Made possible by the Constitution: Tamilisai

అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో వ్యవహరించడం వల్లే అన్ని వర్గాలకు న్యాయం చేకూరే అవకాశం దక్కిందన్నారు. రాజ్యాంగం వల్లే తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగామని చెప్పారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరని, గడిచిన పదేళ్లలో అలాంటి పాలనే సాగిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని, నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని రుజువైందన్నారు. అహంకారం, నియంతృత్వ పాలనకు ప్రజలు తమ ఓటుతో స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తేనే పేదలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని అన్నారు.

ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని వెల్లడించారు. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని గవర్నర్ వెల్లడించారు. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుందని పునరుద్ఘాటించారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. దావోస్ సదస్సులో రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిర్చిన సీఎం, ఆయన బృందాన్ని గవర్నర్ అభినందించారు.

You may also like

Leave a Comment