మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని(Ahmedabad) వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్ జరుగనుంది. భారత్, ఆస్ట్రేలియా(IND vs AUS) పైనల్లో తలపడనున్నాయి. టోర్నీలో ఓటమినే ఎరుగని టీమ్ఇండియా తుదిపోరులో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6 వేలకుపైగా మంది సిబ్బందిని మోహరించింది. స్టేడియంతోపాటు ఆటగాళ్లు బసచేస్తున్న హోటళ్లు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ చెప్పారు. వీరిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గుజరాత్ పోలీసులు, హోమ్‌గార్డులు, ఇతర ఇబ్బందిని నియమించారు.
ఫైనల్ మ్యాచ్‌ను కళ్లారా వీక్షించేందుకు అభిమానులు ఇప్పటికే పెద్దసంఖ్యలో నరేంద్ర మోడీ స్టేడియానికి చేరుకున్నారు. లక్షా 30వేల మంది ఈ మ్యాచ్ తిలకించేందుకు టికెట్లు బుక్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు, అసోం సీఎంతో పాటు పలువురు ప్రముఖులు ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకానున్నారు.
ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 6 వేల మందిలో 3 వేల మంది స్టేడియం లోపల, మిగిలినవారిని స్టేడియ బయట, నగరంలో మోహరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఐపీఎస్ ర్యాంక్ కలిగిన 23 మంది ఐజీ, డీఐజీ, డిప్యూటీ పోలీస్ కమిషనర్లు, 39 మంది మంది కమిషనర్లు, 92 మంది ఇన్స్పెక్టర్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చేతక్ కమాండోలు, బాంబ్ స్క్వాడ్ 10 టీమ్‌లు స్టేడియం పరిసరాల్లో జల్లెడ పడుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం ఎన్నో కీలక మ్యాచ్‌లకు వేదికైంది. లక్షా 30 వేల సామర్థ్యం ఉన్న అతిపెద్ద స్టేడియంగా పేరొందింది. మరోవైపు, పలు కార్యక్రమాలకు బీసీసీఐ రూపకల్పన చేసింది. మధ్యాహ్నం 12.30కు స్టేడియంపైన 10 నిమిషాల పాటు సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ నేతృత్వంలో 500 మందికి పైగా డ్యాన్సర్లు వివిధ సూపర్‌హిట్ పాటలకు నృత్యాలు చేయనున్నారు.