క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ల ఆటతీరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పోటీపడుతున్నారు. ‘బుక్‌మైషో'(bookmyshow) వెబ్‌సైట్, యాప్‌లో ఈ టికెట్ల అమ్మకాలను చేపట్టింది బీసీసీఐ(BCCI). అభిమానులు పోటెత్తుతుండడంతో టికెట్ల ధరలను అమాంతం పెంచేశారు.
ఈ నేపథ్యంలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరపడంతో బీసీసీఐ, బుక్‌మై షోలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జట్టు మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతుండడంతో ఇదే అదనుగా కోల్‌కతాలో కొందరు వరల్డ్ కప్ టికెట్లను భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం మొదలు పెట్టారు.
టికెట్ల ధరలు పెంచడంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బుక్‌మైషో వెబ్‌సైట్‌పై అక్కడి మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బీసీసీఐ, బుక్‌మై షోలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ప్రపంచ కప్ మొదట్లో ఏకపక్ష మ్యాచ్‌లతో అంతగా ఆసక్తిగా అనిపించలేదు. ఆ తర్వాత ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు థ్రిల్‌నిచ్చాయి. జోరు మీదున్న దక్షిణాఫ్రికా, భారత్ ఇప్పటికే సెమీస్‌బెర్తులో ముందున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.