వినూత్న ప్రయోగాలతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా(China). ఇటీవల మానవ నిర్మిత సూర్యుడిని సృష్టించేందుకు ప్రయత్నాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌కు పోటీగా చంద్రుడిపై ప్రయోగాలనూ ఆపడంలేదు. ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు(China Scientists) మరో వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు.
అయితే ఈ ప్రయోగం మాత్రం అంతరిక్షంలో కాదు. ఏకంగా భూమికి 2.5కి.మీల లోతులో ప్రయోగాలు చేపట్టారు. ఇందుకు కావాల్సిన నిర్మాణాన్నీ పూర్తి చేసింది చైనా. అక్కడి శాస్త్రవేత్తలు విశ్వంలో ఉన్న అనేక రహస్యాలకు సమాధానం మన భూమిలో ఉందని నమ్ముతున్నారు. ఇందులో భాగంగా 2400మీటర్ల లోతులో అంటే 2.5 కిలోమీటర్ల దిగువన ప్రయోగశాలను నిర్మించింది.
భూమి కింద చైనా పనిచేస్తున్న ల్యాబ్‌కు ‘జిన్పింగ్ ల్యాబ్’ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రయోగశాల(Worlds Deepest Lab)గా పేరొందుతోంది. జిన్పింగ్ ల్యాబ్ నిర్మించేందుకు మూడేళ్లు పట్టిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా గురువారం వెల్లడించింది. ఈ డ్రాగన్ కంట్రీ ప్రపంచం మొత్తం కృష్ణ పదార్థంలో నిర్మితమైందని నమ్ముతోంది. చీకటి పదార్థం కాంతిని ఆకర్షించని లేదా కాంతిని విడుదల చేయని పదార్థాలతో తయారవుతుందని చెబుతున్నారు.
భూమిలో ఉన్న ‘డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కారణంగానే విశ్వమంతా క్రమబద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాల మధ్య సమన్వయం కూడా కృష్ణ పదార్థం కారణంగా ఉందని చైనా శాస్త్రవేత్తలు విశ్వసించారు. ఎందుకంటే మొత్తం విశ్వంలో అన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులను ఒకే కక్ష్యలో బంధించడానికి తగినంత గురుత్వాకర్షణ లేదని చెబుతున్నారు.
ఈ విషయమై.. మనం ఎంత లోతుకు వెళితే అంత ఎక్కువ కాస్మిక్ కిరణాలు ఆగిపోతాయని సింఘువా భౌతిక శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. లోతైన ల్యాబ్ కృష్ణ పదార్థాన్ని గుర్తించడానికి అనువైన ‘అల్ట్రా-క్లీన్’ సైట్‌గా పరిగణించబడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం కృష్ణ పదార్థాన్ని వెతకడానికి అమెరికాలో ‘లక్స్ జెప్పెలిన్ ఎల్‌జెడ్’ అనే ప్రయోగాన్ని చేసింది.