రాజస్థాన్(Rajastan)లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్(Chambal River Front)లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఆ గంటను బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇంజినీర్‌తో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడినట్లు సమాచారం.
ఈ గంట తయారైనప్పటి నుంచి తరచూ వార్తలో నిలుస్తోంది. చంబల్ రివర్ ఫ్రంట్‌ను ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ గంట దాదాపు 79,000 కిలోల బరువు ఉంటుంది. ఈ భారీ ప్రమాదం కోచింగ్ సిటీ కోటాలో ప్రసిద్ధ చంబల్ రివర్ ఫ్రంట్ వద్ద కలకలం రేపింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద గంట అచ్చును తెరుస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
ఎంతో కష్టపడి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గంటను సిద్ధం చేశారు. గంటను అచ్చు పెట్టెలో కొంత సమయం పాటు ప్యాక్ చేసి ఉంచారు. ఈరోజు తెరవాల్సి ఉంది. ఈ రోజు ఈ గంటను తెరవడానికి దీనిని తయారు చేసిన ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, తన బృందంతో కోట నది ముందుకి చేరుకున్నారు.
అచ్చు పెట్టెలోని గంటను బయటకు తీయడానికి ఆర్య ఎక్కిన వెంటనే 35 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాడు. ఇంజనీర్ ఆర్యను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం వెంటనే ఘటనాస్థలిని పరిశీలించింది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.