యాదాద్రి (Yadadri) ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం క్యూలో నిలబడిన ఓ భక్తురాలికి గుండె పోటు (Heart Attack) వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. క్యూ లైన్ లోనే ప్రాణాలు విడవడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన ముత్తమ్మ (65) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చింది. స్వామి వారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో ఆమె నిల్చుంది. అప్పటి వరకు బాగానే ఉన్న ముత్తమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ముత్తమ్మకు ఏమైందని చూసేలోపే ఆమె తుది శ్వాసవిడిచింది. వెంటనే ఆలయ సిబ్బంది సహాయంతో ఆమె మృత దేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దైవ సన్నిధిలోనే భక్తురాలు మృతి చెందడంతో వెంటనే అర్చకులు ఆలయాన్ని మూసి వేశారు.
అనంతరం శుద్ది సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని తెరచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్తిక మాసం కావడం, సోమవారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. దీంతో క్యూలైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.