మహిళల(Woman)ను వేధించే, వారిపై నేరాలకు పాల్పడే ఈవ్ టీజర్లకు యూపీ సీఎం(up cm) యోగీ ఆదిత్యనాథ్(yogi adityanath) మాస్ వార్నింగ్(warning) ఇచ్చారు. ఈవ్ టీజర్ల కోసం మృత్యు దేవుడైన యముడు ఎదురు చూస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. సీఎం యోగీ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. మోటార్ సైకిల్ పై వచ్చిన వ్యక్తుల దాడిలో మరణించిన బాలిక ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలో మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ బాలికను వేధించారు. మోటార్ సైకిల్ పై వెళుతూ ఆమె దుపట్టాను పట్టుకొని లాగారు. దీంతో ఆ బాలిక కింద పడగా వెనక నుంచి వచ్చిన మోటార్ సైకిల్ ఆమె పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కస్టడీకి తరలించే సమయంలో ఇద్దరు నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై కాల్పుల జరిపామన్నారు. నిందితులకు బుల్లెట్ గాయాలయ్యాయని పేర్కొన్నారు.
అంబేడ్కర్ నగర్ జిల్లాలో 343 కోట్ల రూపాయల విలువైన 76 ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం యోగీ ఆదిత్య నాథ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈ ఘటనపై ఆయన స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని వదలబోమన్నారు. వారి కోసం మృత్యు దేవుడైన యమరాజు ఎదురు చూస్తున్నారంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.