ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటిందంటూ మండిపడ్డారు. లక్షల రూపాయల అప్పులు తెచ్చి ఖర్చు చేసినా సకాలంలో బిల్లులు రాక అప్పులు తీర్చలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలోని 4 శాతం ద్రవ్య లోటు నుంచి 9.6 శాతానికి పెరగడం జగన్ సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు.
జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం 3 దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని యనమల తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అధ్వానంగా ఉందని కాగ్ ఎండగట్టిందని చెప్పారు. ఆదాయం కంటే చేస్తున్న అప్పులే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొందన్నారు. ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారని తప్పుపట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
రహస్య అప్పులతో ప్రమాదమని హెచ్చరించినా లెక్కచేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సైతం అవాక్కైందంటూ సెటైర్లు విసిరారు. అప్పులపై వివరణ కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్ తేల్చిందన్నారు యనమల.