తెలుగు దేశం పార్టీకి తాను పిల్లర్ లాంటి వాడినని ఆ పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పార్టీ మారతారని వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీని అభిమానించే కుటుంబం తమదని, నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీ నుంచి తానెందుకు తప్పుకుంటానని ప్రశ్నించారు.
ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఏపీలో వైఎస్ జగన్ పాలన రెండు నెలల్లో ముగుస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రజాస్వామ్యం లేని పార్టీ అని, అలాంటి పార్టీలోకి వెళ్లినవాళ్లే పారిపోతున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. తల్లినీ, చెల్లిని కాపాడలేని జగన్ ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడతాడా? అని ప్రశ్నించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం నిర్వీర్యమైందని శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ అంతులేని అహంకారంతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, సాక్ష్యాలు లేని కేసుల్లో చంద్రబాబును ఇరికించారని చెప్పుకొచ్చారు. నకిలీ లిక్కర్‌తో లక్షలాది మంది అవయవాలు పనిచేయకుండా చేశారని, జగన్ ధన దాహానికి వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కార్పెట్ వేసుకుని పర్యటనలు చేసిన సైకో సీఎం జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకృతి జగన్‌ను పగబట్టడం ఖాయం: యరపతినేని
వేలకోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్న సీఎం జగన్‌పై ప్రకృతి పగబడుతుందని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. విశాఖ రుషికొండను బోడిగుండు చేశారని, రూ.500కోట్ల ప్రజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ కోపం ముందు జగన్ నిలవలేడు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్.. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్నారు.