వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలా ప్రకటించారో లేదో.. వెంటనే వైసీపీ (YCP) వర్గాలు ఎటాక్ మొదలుపెట్టాయి. సోషల్ మీడియా (Social Media) లో చంద్రబాబు, పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ (Jagan) సేన విమర్శల దాడి కొనసాగిస్తోంది.
ట్విట్టర్(ఎక్స్)లో వైసీపీ అధికారిక అకౌంట్ లో “ప్యాకేజ్ బంధం బయటపడింది” అంటూ పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది పవన్. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం’’ అని ట్వీట్ చేశారు.
మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేశారు. ఎప్పుడో అయ్యాడు.. ఇప్పడేముంది కొత్తగా ములాఖత్ అని అంటూ.. జన సైనికులూ ఆలోచించండి.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలా లేదూ? అని చమత్కరించారు. అలాగే, ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్ళు ఎవరూ లేరు కళ్యాణ్ బాబు అంటూ పవన్ ను ట్యాగ్ చేశారు అంబటి.
మరోవైపు, పవన్ కళ్యాణ్ నిర్ణయంపై జనసేన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే చేస్తారని.. ఆయన వెంటే తాముంటామని సోషల్ మీడియాలో స్పష్టం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెబుదామని పిలుపునిస్తున్నారు.