ఎన్నికల ముందు వైసీపీ(YCP)కి ఊహించని షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ(Narasaraopet MP) కృష్ణదేవరాయలు(Krishnadevarayalu) వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆయనను కలిసేందుకు మాచర్ల, పెదకూరపాడు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆలోపే శ్రీకృష్ణదేవరాయలు ప్రకటన చేసినట్లు తెలిసింది. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని అధిష్టానం భావించిందని.. ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని ఆయన అన్నారు.
దానికి తాను బాధ్యుడిని కాదన్నారు. కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలును మార్చొద్దంటూ 10 రోజులుగా అధిష్టానానికి పల్నాడు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈసారి గుంటూరు నుంచి పోటీకి దిగాలని శ్రీకృష్ణదేవరాయలకు అధిష్ఠానం సూచించింది. అయితే, ఆయన నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. దీంతో అధిష్ఠానం ససేమిరా అనడంతో శ్రీకృష్ణదేవరాయలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.