కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీలేదని బీజేపీ ఫ్లోర్ లీడర్(BJP Leader) యేలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. రైతాంగం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని మండిపడ్డారు.
ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక నిండా ముంచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో రైతుబంధు 7వేల కోట్లు మిగిలిపోయాయని.. ఆ డబ్బంతా ఎటు పోయిందని ప్రశ్నించారు. అదేవిధంగా రూ.57 వేల కోట్ల రాష్ట్ర రెవెన్యూ ఏమైందని నిలదీశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) చాలా తెలివైనోడని, ఏం చేసినా తన మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడని విమర్శించారు.
ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ పేర్లతో వసూళ్ల దందాకు తెరలేపారని మండిపడ్డారు. రైతులకు తక్షణ సాయం చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని తెలిపారు. తక్షణ సాయంలో కొత్త ట్యాక్స్‌లు వర్తించవు కాబట్టే రైతులకు సాయం అందించడంలేదన్నారు. అమలు కానీ హామీలన్నీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పేస్తున్నారని అన్నారు.
ఆ హామీలన్నింటినీ రేవంత్ ఇంట్లో కూర్చుని డిజైన్ చేశాడేమోనని అనుమానం కలుగుతుందంటూ సెటైర్ వేశారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్సులు కట్టనిదే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదా? అన్నారు. ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ ట్యాక్సా? లేక రేవంత్ ట్యాక్సా? అని ప్రశ్నించారు. అదేవిధంగా బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్సా? లేక పెండింగ్ బిల్లుల ట్యాక్స్ కావచ్చేమో అంటూ ఎద్దేవా చేశారు.